పామెనలో సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఉత్సాహంగా క్రీడా పోటీలు
చేవెళ్ల: న్యూ ఈడెన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని పామెనలో ఉన్న సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్‌లో క్రీడా పోటీలు రెండో రోజు కూడా ఉత్సాహంగా కొనసాగాయి. ఈ పోటీలను ప్రముఖ నటుడు, యాంకర్ పామెన రవి అలియాస్ బిత్తిరి సత్తి, పామెన కౌన్సిలర్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వం పెంపొందించడంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందేందుకు దోహదపడతాయని తెలిపారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించగలరని అన్నారు. పోటీలలో వివిధ క్రీడా విభాగాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్స్ రెహానా, సుకన్య, కరస్పాండెంట్ శశిపాల్ రెడ్డి, డైరెక్టర్లు గాలయ్య, సుజాత, రఘునాథ్ రెడ్డి, నరసింహ గౌడ్, మహేందర్ రెడ్డి, నిరంజన్ బాబు తదితరులు పాల్గొన్నారు.