చేవెళ్లలో జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు ప్రారంభం..
లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
చేవెళ్ల, ఫిబ్రవరి 26 (): తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చేవెళ్ల పార్లమెంట్ అధ్యక్షుడు చిరాగ్ ప్రజిత్ గౌడ్ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. కార్యక్రమానికి శ్రీకారం చుట్టే ముందు చేవెళ్లలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇది కేవలం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మాత్రమే కాదని, ఒక సామాజిక–రాజకీయ ఉద్యమమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటి పరిష్కార దిశగా స్పష్టమైన చర్యలు కనిపించడం లేదన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దిశ, కొత్త రాజకీయ శక్తి అవసరమని వ్యాఖ్యానించారు.
గతంలో దోపిడి పాలనను చూశామని, ఇకపై అభివృద్ధి దిశగా నూతన ఉత్తేజంతో ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందన్నారు. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన పార్టీ కాదని, హైదరాబాద్‌లో ఆవిర్భవించిన తెలంగాణ ఆధారిత రాజకీయ శక్తి అని స్పష్టం చేశారు. సభ్యత్వం ద్వారా యువతకు రాజకీయ అవగాహనతో పాటు నాయకత్వ శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలోని యువకులను నాయకులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. యాక్టివ్ సభ్యత్వం పొందిన వారికి ప్రమాద బీమా సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన పక్షంలో రూ.5 లక్షలు, శాశ్వత దివ్యాంగులైన పక్షంలో రూ.2 లక్షల బీమా అందజేస్తామని చెప్పారు. ప్రమాదవశత్తు ఆసుపత్రి ఖర్చులకు రూ.50 వేల వరకు భరోసా సాయం అందించనున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అనివార్య కారణాలతో బాధపడిన వారికి ఇప్పటికే చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు.సాధారణ యువతకు రాజకీయ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.సభ్యత్వ నమోదు కార్యక్రమం ఫిబ్రవరి 26 నుంచి మార్చి 10 వరకు కొనసాగుతుందని, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ సందర్భంగా తన తాత, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే చిరాగ్ ప్రతాప్ లింగం రాజకీయ ప్రస్థానాన్ని స్మరించారు. బాల్యం నుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న ప్రతాప్ లింగం, మర్రి చెన్నారెడ్డి, వందేమాతరం రామచంద్రరావు, రామానంద తీర్థంలతో కలిసి నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. వృత్తిరీత్యా జర్నలిస్టుగా పనిచేసిన ఆయన, 1977 సార్వత్రిక ఎన్నికల్లో జనతా పార్టీ తరఫున చేవెళ్ల అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి కొండా వెంకట రంగారెడ్డిపై విజయం సాధించారని వివరించారు.ప్రతాప్ లింగం గౌడ్ 1982లో గుండెపోటుతో మరణించారని తెలిపారు. పేదల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన ఆయన, మొయినాబాద్ మండలం సూరంగల్ గ్రామంలో నిరుపేదలకు భూములు దానం వంటి సేవచేసిన కార్యమాలను అయన గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్,అజయ్,దివాకర్,మహేందర్,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
