జాతీ రత్నాలుగా ఎదగాలి
– ఆదర్శంగా సత్య సాయి స్కూల్
– తల్లిదండ్రులకు హెల్మెట్ గిఫ్ట్ గా ఇవ్వండి
– సినీ ఆర్టిస్ట్ బిత్తిరి సత్తి
చేవెళ్ల జనవరి 26 : విద్యార్థులు రేపటి జాతి రత్నాలు ఎదగాలని సినీ, మిమిక్రీ ఆర్టిస్ట్, కమెడియన్ బిత్తిరి సత్తి అలియాస్ పామెన కావలి రవికుమార్ సూచించారు. సోమవారం గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని శ్రీ సత్య సాయి గ్రామర్ హైస్కూల్ లో వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సిఐ ఉపేందర్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిత్తిరి సత్తి హాజరయ్యారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పార్కును సీఐ ఉపేందర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బిత్తిరి సత్తి మాట్లాడుతూ.. నేటి విద్యార్థులే రేపటి బావి భారత పౌరులని అన్నారు. క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తెలిపారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులకు హెల్మెట్ ను బహుమతిగా ఇవ్వాలన్నారు. మద్యం సేవించి, అపరిమిత వేగంతో వాహనాలు నడపరాదని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదని చెప్పారు. అదేవిధంగా విద్యార్థులు స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని వివరించారు. పాఠశాల ఆవరణలో ట్రాఫిక్ పార్క్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. విద్యార్థులకు ట్రాఫిక్ పై అవగాహన, నియమ నిబంధనలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ తదితర అంశాలను పాఠ్యాంశంలో భాగంగా విద్యార్థులకు నేర్పించాలని సూచించారు. అనంతరం 100 మీటర్ల జాతీయ పతాకంతో చేవెళ్ల పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డ్ నుంచి శంకర్ పల్లి చౌరస్తా నిర్వహించిన తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడే విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో సీఐ ఉపేందర్, ఎస్ఐలు తేజశ్రీ వనం శిరీష, పాఠశాల డైరెక్టర్లు నల్లనాయుడు స్వరూప్ రెడ్డి, శ్రీనివాస్ సంతోష్, బి.గోపాల్(సీనియర్ జర్నలిస్ట్), ప్రిన్సిపల్స్ అరుణ్ మోన్యా, స్నేహ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సత్య సాయి స్కూల్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతున్న బిత్తిరి సత్తి

సత్య సాయి స్కూల్లో ట్రాఫిక్ పార్కును ప్రారంభిస్తున్న సినీ నటుడు బిత్తిరి సత్తి